Pages

Tuesday 30 October 2012

♥ అమ్మ ♥




                                                
  రోజు, నేను చదివిన రెండు కథలు మీతో పంచుకోబోతున్నా.....రెండూ తల్లి ప్రేమ గురించినవే..... కథలు   చదవగానే మనసులో ఏదో ఒక చెప్పలేని అనుభూతి....బాధ,ప్రేమ,సంతోషం ఇంకా ఏవో కలగలిపిన ఒక అనుభూతి....ఏమో అదేమిటో కూడా నాకు తెలియదు....హ్హ!!!!!!!!! సరే ఇక కథ చెబుతా వినండి.....

1 . ఒక అబ్బాయి వంటింట్లో వంట చేస్తున్న వాళ్ళ అమ్మ దగ్గరకి పరిగెడుతూ వచ్చి,ఒక కాగితం ముక్క చూపించాడు...దాని మీద ఏదో రాసి తీసుకొచ్చాడని గమనించిన వాళ్ళ అమ్మ, కొంగుతో చేయి తుడుచుకుని కాగితం తీసుకుని చదవటం మొదలు పెట్టింది...అందులో ఇలా ఉంది...
         మొక్కలకి నీళ్ళు పోసినందుకు                : 20 రూపాయిలు 
        నా గది శుబ్రం చేసినందుకు                      : 10 రూపాయిలు 
        నీ కోసం షాప్ కి  వెల్లివచ్చినందుకు              :  5 రూపాయిలు 
        చెల్లిని ఆడించినందుకు                             :  2 రూపాయిలు 
       మంచి మార్కులు తెచ్చుకున్నందుకు      :  20 రూపాయిలు 
        చెత్త బయటపడేసినందుకు                       :    3 రూపాయిలు 
                                      మొత్తం                    :  60  రూపాయిలు 


ఇదంతా చదివిన వాళ్ళ అమ్మ చిరునవ్వుతో పిల్లాడి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది....నేను చేసిన పనులన్నీ జ్ఞాపకం చేసుకుంటుంది కాబోలు అనుకున్నాడు....పెన్ను తీసుకుని కాగితాన్ని తిరగేసి రాయటం మొదలెట్టింది...
         తొమ్మిది నెలలు మోసి కన్నందుకు                                                                             :  ఏమీ వద్దు
        నీకు జ్వరం వస్తే ఎన్నో రాత్రులు పడుకోకుండా మందులు వేసినందుకు                            :  ఏమీ వద్దు
         నీకు  జబ్బు  చేస్తే డాక్టరు దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళినందుకు                                                :  ఏమీ వద్దు 
        నీకు స్నానం చేయించి,నూనె రాసి,పౌడర్ వేసి, చివరికి ముక్కు తుడిచినందుకు కూడా      : ఏమీ  వద్దు
        నీకు జాబిల్లిని చూపించి,పాటలు పాడి,కథలు చెప్పి కొసరి కొసరి తినిపించినందుకు నాకు    : ఏమీ వద్దు 
               మొత్తం,నేను నీకోసం చేసిన ప్రతిపని లోను ఉన్న నా ప్రేమ కి  ప్రతిఫలంగా   నాకు           : ఏమీ వద్దు 

ఇది చదివిన పిల్లాడు  కళ్ళనిండా కన్నీళ్ళతో వాళ్ళ అమ్మతో "అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం" అంటూ...వాళ్ళ అమ్మ చేతిలోని పెన్ను తీసుకుని.....పెద్ద పెద్ద అక్షరాలతో రాసాడు "PAID IN FULL " అని.

"తల్లిదండ్రులు మన నుండి ఏమి  ఆశించరు ప్రేమ తప్ప .......మీరు తల్లిదండ్రులు అయ్యాక ,తల్లిదండ్రుల విలువ ఏంటో తెలుస్తుంది...."



2. ఇది ఒక కొడుకు తన తల్లి గురించి చెప్పిన కథ .......

మా అమ్మకి ఒకే కన్ను ఉండేది....నాకు చాలా ఇబ్బందిగా,చిరాకుగా అనిపించేది....తను ఒక స్కూల్ లో వంట మనిషిగా పనిచేసి మా కర్చులకి డబ్బు సంపాదించేది....నాకు తను మా అమ్మ అని చెప్పుకోవాలంటే చాలా అవమానంగా అనిపించేది..ఒక రోజు తను మా స్కూల్ మీటింగ్ కి వచ్చింది....నాకు చాలా కోపం వచ్చిందితనవైపు అసహ్యంగా చూసి అక్కడినుంచి వెళ్ళిపోయాను ... రోజు స్కూల్ లో అందరూ మీ అమ్మకి ఒకటే కన్ను ఉంది అని ఏడిపించటంతో కోపం వచ్చి,అమ్మా,నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో,లేదంటే చచ్చిపో అని అరిచాను...మా  అమ్మ ఏమి అనలేదు..నేను తప్పుచేసానా??,అమ్మని బాధ పెట్టానా???? అని మనసులో అనిపించింది...కానీ నా మనసులో ఉన్నది చెప్పేసాను అని సరిపెట్టుకున్నాను... 
మా అమ్మ ఏమి అనకపోవటం వల్లనో ఏమో......నాకు,నేను చేసింది తప్పు అనిపించలేదు....
రోజు రాత్రి మంచినీళ్ళు తాగటానికి వంటింట్లోకి వెళ్ళిన నాకు మా  అమ్మ ఏడుస్తున్న శబ్దం చిన్నగా వినిపించింది....నా నిద్రకు ఇబ్బంది కలుగుతుందనేమో...చాలా చిన్నగా ఏడుస్తోంది....చూసి చూడనట్టు వెళ్ళిపోయా.....నేను తనని బాధపెట్టాను అని ఏదో మూల నా మనసు నన్ను తోలచేస్తున్నా, నేను పెద్దగా పట్టించుకోలేదు... 
ఇక ఎలా  అయినా  మా అమ్మనుండి, ఇబ్బందికర పరిస్థితి నుండి బయటపడాలని చాలా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించాను....మా అమ్మకి, ఊరికి దూరంగా వెళ్ళిపోయాను....పెళ్లి చేసుకున్నాను....నాకు ఎవరూ లేరని నా భార్యకి అబద్ధం చెప్పాను....నేను,నా భార్య,పిల్లలు సంతోషంగా ఉంటున్న సమయంలో ఒక రోజు మా అమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చింది...ఎవరు నువ్వు...నాకు నువ్వెవరో తెలియదు....ఒక కన్నులేని నిన్ను చూసి నా కూతురు బయపడుతోంది బయటకి పో....అని అరిచాను...."క్షమించండి నేను తప్పు అడ్రస్ కి వచ్చినట్టున్నాను" అని మా  అమ్మ వెళ్లిపోయింది.... 
ఒక రోజు స్కూల్ reunion ఉందని లెటర్ రావటంతో నా భార్యకి ఆఫీస్ పని అని అబద్ధం చెప్పి వెళ్ళాను.... reunion అయిపోయాక ఊరికే అలా  ఇంటికి వెళ్ళాను...మా అమ్మ నేల మీద పడి ఉంది...చనిపోయింది...నా కళ్ళల్లో ఒక్క చుక్క కూడా కన్నీరు రాలేదు....అమ్మ చేతిలో ఏదో కాగితం కనిపించింది,తీసి చూసాను..

"బాబూ.......ఇంకెప్పుడు నీ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టను....కాని నువ్వే అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసిపోతావా??? అని అడగటం కూడా నా అత్యాశేనేమో....నువ్వు రీయూనియన్ కి వస్తున్నావని తెలిసి చాలా సంతోషం కలిగింది....కానీ స్కూల్ కి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టటం ఇష్టంలేక రాలేదు....నాకు ఒకటే కన్ను ఉన్నందుకు నన్ను క్షమించు....నీకు చాలా చిరాకు కలిగించాను.... 
నువ్వు చాలా చిన్నవాడివి గా ఉన్నప్పుడు నీ కన్నుకి గాయం అయ్యి, కన్ను తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది....నిన్ను ఒక కన్నుతో ఊహించుకోలేకపోయాను, నీకు ఒక కన్ను ఉండదు అనే నిజాన్ని, బాధని తట్టుకోలేక పోయాను....నా కన్ను నీకు ఇచ్చాను...నా కొడుకు నా స్థానంలో,నా కోసం కన్నుతో ప్రపంచాన్ని చూస్తున్నాడు అని చాలా గర్వపడ్డాను. నువ్వు ఏమి చేసినా నాకెప్పుడు కోపం రాలేదు....నువ్వు ఎప్పుడైనా అరిచినా నా మీద ఉన్న ప్రేమతోనే తిడుతున్నావ్  అనుకునేదాన్ని....నీ చిన్నతనం లో నువ్వు చేసిన  అల్లరి, నీ ముద్దుముద్దు మాటలు, జ్ఞాపకాలు,నా చుట్టూనే తిరిగుతుంటాయ్... 
నాకు నువ్వు చాలా గుర్తోస్తున్నావు....నువ్వు నా పక్కనే ఉంటే బాగుండు అనిపిస్తోంది...నాకు నువ్వంటే చాలా ఇష్టం రా నాన్నా !!!!  నువ్వే నా ప్రపంచం "

  ఇది చదివిన నేను కుప్పకూలిపోయాను....ఇన్నాళ్ళు నాకోసం బ్రతిన మనిషి ఇక లేదని గుండెలు పగిలేలా ఏడిచాను....."అమ్మా!!!!" 

                                                        

కథలు చదువుతున్నప్పుడు ఎవరికైనా సరే ఏదో తెలియని ఒక ఫీలింగ్ కలుగుతుంది....మొదటి కథలో చిన్నతనం లో తెలిసీ తెలియక చేసిన తప్పు,రెండవ కథలో అన్నీ తెలిసినా మనిషి  దూరం అయ్యేదాక   తెలుసుకోలేని తప్పు....
ఇలాంటి వాళ్ళని కథల్లోనే కాదు నిజజీవితంలోనూ చూస్తూనే ఉన్నాం...అందుకే ఇన్ని వృద్ధాశ్రమాలు వెలిసాయి....
పెళ్లి అవ్వగానే తల్లిదండ్రులని పట్టించుకోని పిల్లలకి...వాళ్ళు తల్లిదండ్రులు అయ్యాక.... విలువ ఏంటో తెలుస్తుంది..
అసలు పెళ్లి అవ్వగానే తల్లిదండ్రులని ఎందుకు పట్టించుకోరు??? మన సీరియల్స్ ఎఫెక్టో ఏమో కానీ... మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే....చాలా మంది అమ్మాయిలు...అత్తగారు అంటేనే ఒక విలన్ అని ఊహించేసుకుంటున్నారు..... మధ్య నా స్నేహితురాలికి పెళ్లి కుదిరిందని తెలిసి కలవటానికి వెళ్లాను...కాసేపు ముచ్చట్లు అయ్యాక....అబ్బాయిగురించి అడిగాను...."అబ్బాయి మంచివాడే కానీ వాళ్ళ అమ్మ, అంటే మా అత్తనే, మొహం చూస్తేనే  సూర్యకాంతంలా ఉంది , గయ్యాళి ఏమో అని నాకు భయంగా ఉంది " అంది....నేను వెంటనే ఓహో!! నువ్వు పేస్ రీడింగ్ ఎప్పటినుంచి నేర్చుకున్నావ్.....మొహం చూసి  జాతకాలు చెప్పటం లాంటివి ఏమైనా చేస్తున్నవా అని satirical గా చురక  వేసాను.... పిల్లకి భల్లే కోపం వచ్చేసి,బుంగ మూతి పెట్టేసింది..... తర్వాత అలా ముందే, ఆమె గయ్యాళి అని  ఫిక్స్ అయిపోతే, ఆమె ఏమి చేసిన -ve గానే కనిపిస్తుందే నీకు...అని అది ఇది చెప్పి నచ్చజేప్పాను....కానీ నిజమే కదండి అలా అత్త అంటే గయ్యాళి అని ఊహించేసుకుంటే వాళ్ళు  ఏం చేసిన తప్పుగానే కనిపిస్తుంది....ఇక్కడ నేను ఎవరినీ తప్పుపట్టటం లేదు...కోడల్లందరు తప్పు అని నేను అనను...ఎందుకంటే నేను కూడా తరం కోడలినే....నేను నేటి మహిళను అన్నటు ఉంది కదా ఈ డైలాగ్ హహ్హహ్హ......
అమ్మాయికి తల్లిదండ్రులు ఎలా ఉంటారో అబ్బాయికి అలానే...అందుకే అమ్మాయిలూ మీ తల్లిదండ్రుల్లానే అత్తమామలు కూడా ....వాళ్ళనీ   ప్రేమించండి,గౌరవించండి....
ఇక అబ్బాయిలూ....ఆహా ఓహో కావ్య సూపర్గా చెప్పింది....అమ్మాయిలు నేర్చుకోండి...అని గెంతులేయకండి....మీరు కూడా అంతే.......మీ తల్లిదండ్రులని మీ భార్య ఎలా గురవించాలి అని ఆశిస్తారో అమ్మాయి తల్లిదండ్రులని కూడా గౌరవించండి :) 
ఇక అత్తమామలు కూడా కోడలిని  విలన్లా, తమ కొడుకుని తమకి దూరం చేస్తున్న వ్యక్తిలా కాకుండా...వాళ్ళ కూతురిలానే చూసుకోవాలి....అది వేరే విషయం అనుకోండి....ఇక టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతోంది....మనం వెనక్కి వచ్చేద్దామా???



ఇక విషయంలోకి వస్తే....   కథలు  చదువుతున్నప్పుడు....ఇంగ్లీష్-వింగ్లిష్   సినిమా  చూసినప్పుడు....నాకు బాధ  వేసింది...నా చిన్నతనం గుర్తొచ్చింది..... ఎందుకంటే  నేను  కూడా  చిన్నప్పుడు  తెలియని  వయసులో 
మా  అమ్మ ఏదైనా  అడిగితే  నీకు  తెలియదులే  అనేదాన్ని....మా  అమ్మ  ఎక్కువ  చదువుకోలేదు.... కానీ  నేను  5th   క్లాసు  లో  ఉండగా  మా  సైన్సు  సార్ నన్ను  కొడితే , మీరు  నమ్మరు  కాని  నా  చెవిలో  రెండు  రోజులు  కుయ్య్... మని  ఒకటే మోత......అప్పుడు  మా  అమ్మ  స్కూల్  కి  వచ్చి, మా  సార్ ని చెడా మాడా తిట్టేసింది .........
చదువుకోపోతే  నేను  పోషించుకుంటా,కానీ  మరీ  ఇంతలా  కొడితేనే  చదువు  వస్తుంది  అంటే నా  కూతురికి  చదువే  వద్దు...అని  తెగ  తిట్టి  పోసింది 
అప్పటికి  నాకు  జ్ఞానోదయం  అయ్యి  మా  అమ్మ  విలువేంటో, తల్లి ప్రేమ ఏంటో   తెలిసొచ్చింది......ఇక తర్వాత నేను మల్లి ఎప్పుడూ "అమ్మా  నీకు తెలీదు" అనే మాట అనలేదు....ఇక ఇలాంటి అనుభవాలు ఎన్నో....నాకు అమ్మ విలువ తెలియజేసిన సంఘటనలెన్నో....కానీ అవన్నీ ఇంకో టపా లో రాసుకుందాం.....నాకు తెలుసు ఇప్పటికే ఇంత పెద్ద పోస్ట్ రాసానని మీరు నన్ను తిట్టుకుంటున్నారు....హహ్హహ్హా....

                                                                                               ..............మీ కావ్యాంజలి ♥♥♥
 

View Count




Useful Links