Pages

Tuesday 18 December 2012

కుటుంబం,ఉద్యోగం నడుమ ఈ తరం అమ్మాయి


అప్పుడప్పుడే తెలవారుతుంది.....తలారా స్నానం చేసిన నేను, రేడియో ఆన్ చేశాను..."ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే,ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్" అంటూ ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతున్నారు...నేను పొయ్యి మీద పాలు పెట్టి, ముగ్గు డబ్బా తీసుకుని వాకిట్లోకి వెళ్లి, ముగ్గు వేస్తుండగానే, చంటాడు లేచి సంగీతం ప్రాక్టీసు మొదలు పెట్టాడు, పరిగెత్తుకెళ్ళి వాడిని ఎత్తుకుని....ముగ్గు ముగుంచి.....మా వారిని లేపి, బ్రష్ మీద పేస్టు వేసిచ్చి, చంటి గాడి మొహం కడిగి,వంటింట్లోకి వెళ్లి మా వారికి కాఫీ,చంటాడికి పాలు కలిపిచ్చాను.....కాసేపు పిల్లాడిని చూసుకుందురూ.. చక చకా టిఫిన్ చేసేస్తాను....అంటూ ముగించానో లేదో మా వారు లేచి స్నానానికి వెళ్ళిపోయారు... చంటి గాడు మళ్లీ  సంగీతం అందుకున్నాడు....ఇక తప్పదు అనుకుని....వాడ్ని తీసుకుని వంటింట్లోకి వెళ్లి...వాడి చేతిలో ఒక ఆపిల్ పెట్టి....వంట మొదలుపెట్టాను....పాలవాడు, కూరగాయలమ్మి ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ....మొత్తానికి వంట ముగించి....మా వారికీ డబ్బా కట్టేసి....తను టిఫిన్ చేసేలోపు చంటి గాడికి పెట్టేసి....శ్రీవారు ఆఫీసు కి వెళ్తుంటే,గుమ్మం దాక వెళ్లి టాటా చెప్పేసి లోపలి వచ్చాను....చంటి గాడికి స్నానం చేయించి చొక్కా వేస్తుండగానే నిద్రలోకి జారుకున్నాడు.....ఇల్లంతా సర్దేసి చిన్నగా రేడియో పెట్టి,పేపర్ పట్టుకు కూర్చున్నాను....ఇల్లంతా ప్రశాంతంగా ఉంది.....(Mr.పెళ్ళాం సినిమా గుర్తొచ్చిందా??) అంతే!!!!!!!!! టిర్ర్ర్ర్ర్ ర్ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ మంటూ గట్టిగా శభ్ధం, ఉలిక్కిపడి లేచాను......"అలారం"....సూర్య కిరణాలు కిటికిలోంచి మొహం మీద పడుతుంటే...ఓఒ ఇదంతా కలా అనుకుంటూ లేచాను :D 
                                                             

ఇక రియాలిటీ లోకి వస్తే.....
నేను, మా వారు ఇద్దరం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాం.... నేను ఉదయం 9:30 కి ఆఫీసులో ఉండాలి. తను 10 గంటలకల్లా ఆఫీసు చేరుకోవాలి..ఉదయాన్నే లేచి ఏదో వండేసి , వండింది ఇంత నోట్లో వేసుకుని....ఇంకాస్త  బాక్స్ లో  వేసుకుని...ఆఫీసులకి వెళ్తాం.....అక్కడ మేనేజర్ గారు "వచ్చారా మేడమ్, రండి రండి,ప్రయాణం కులాసాగా జరిగిందా అన్నట్టు చాలా వెటకారంగా చూస్తూ,టైం ఎంతయ్యింది అంటాడు" మనం ఎక్కడ లేని వినయం చూపిస్తూ ఓ నవ్వు  నవ్వితే అక్కడితో ఆపేస్తాడు.....లేదు అని  రెచ్చిపోయమో పుచ్చిపోయామే....అలా సర్దుకుని....ఏదో ఉన్న పని చేసుకుని...లంచ్ అవర్ లో తనకి ఒకసారి కాల్ చేసి తిన్నారా, ఏంటి విశేషాలు అంటామో లేదో  టైం అయిపోతుంది అని గుర్తుకు వస్తుంది....ఇక ఉంటానండి అని ఫోన్ పెట్టేసి.....బ్రతకాలంటే తినాలి అనుకుని, తెచ్చుకున్న డబ్బా ఖాలీ చేయాలి...ఇక మళ్లీ వెళ్లి పనిలో పడిపోతా.....ఇక కాస్త త్వరగా ఇంటికి చేరుకోలిగితే పరవాలేదు....ఏదో వంట అనే కార్యక్రమం కాస్త సజావుగా సాగిపోతుంది...కానీ , పొరపాటున నాకు పని వల్ల కాస్త ఆలస్యం అయ్యిందో...ఇక అంతే సంగతులు....వంట చేయటానికి టైమూ,ఓపిక రెండూ ఉండవు.....అప్పుడు ఎక్కడో మనసు మూలల్లో ఏదో తెలియని ఒక అసంతృప్తి,అసహనం ....అయ్యో!!! మా ఆయనకి సరిగా వండి పెట్టలేకపోతున్నానే అని....పోనీ ఉదయాన్నే లేచి చక్కగా వండుదామా అంటే...అదేమిటో, నిద్రా దేవత ఇప్పుడు లేవనివ్వానంటే లేవనివ్వను అని పట్టుబడుతుంది.....ముందు రోజు పని అలసట వల్లనో ఏమో....శరీరం కూడా సహకరించదు......అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది,ఈ సమస్యని ఎలా అధిగమించాలి అని ఆలోచించే లోపే మళ్లీ ఆఫీసు టైం అయిపోతుంది....మళ్లీ పరుగో పరుగు.....
ఇలా 5 రోజులు పరుగులు తీస్తూ, ఒక రోజు ఇంట్లో ,ఒక రోజు బయట తింటూ గడిపేస్తూ, ఒకరిమోహాలు ఒకరం సరిగా చూసుకున్నామో లేదో తెలియని అయోమయంలో ఉంటూ ఆ 5రోజుల పండగ కాస్తా ముగించేస్తాం....
ఎంతో  ఆశగా ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేస్తుంది...."శనివారం, ఆదివారం" . ఒరిస్సా తుఫాను బాధితుడికి తిండి దొరికినట్టు దొరికే ఆ రెండు రోజులు వస్తూనే....కూరగాయలు, సరుకులు,షాపింగ్,బిల్లులు కట్టడాలు,ఇల్లు శుబ్రం చేసుకోవటం , అలసిపోయి పడుకోవటం తో తుర్ర్ మని ఎగిరిపోతాయి రెండు రోజులు....
పోనీ, ఎంత సేపూ భాధ్యతలేనా...ఈ వారం ఎంజాయ్ చేద్దాం అనుకుని...సాహసం చేసి ప్లాన్ చేస్తే......ఇంట్లో పనులన్నీ అలా ఉండిపోతాయి  ...ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి పనులన్నీ చేసి...అలిసిపోయి పడుకుంటామా....ఆ అలసటకి తోడు , నిద్రాదేవి నేనూ  ఉన్నానంటూ సోమవారం నిద్ర లేవనివ్వదు.....
ఇక ఆఫీసుకి ఆలస్యంగా వెళ్ళామా ...అంతే...బాస్ గారు పంచబక్ష పరమాన్నాలతో సత్కరించి...సన్మాన కార్యక్రమం మొదలు పెడతారు....ఎప్పుడైనా టైం దొరికినప్పుడు,ఆఫీసు కాబ్ లో వెళ్తూ ఆలోచిస్తే చిన్న అసంతృప్తి, ఏదో వెలితి....ఏంటి ఈ జీవితం??? ఇలా ఎంతకాలం పరుగులు?? అసలు కుటుంబం కోసం నేను ఏం ేస్తున్నాను...అయిన వాళ్ళని ఫోన్ లో కూడా పలకరించే టైం లేకుండా అయిపోయింది...పోనీ ఆఫీసులో మనం ఏమైనా గొప్ప పోసిషన్ లో ఉన్నామా అని తరిగి చూసుకుంటే....అదే కుర్చీ,అదే టేబుల్,అదే కంప్యూటర్...నొక్కి నొక్కి అరిగిపోయిన మౌస్,కొట్టి కొట్టి అరిగిపోయిన కీబోర్డ్...ఒక వెయ్యో రెండు వేలో హైకు....మరీ      జుట్టుపీక్కుని, కళ్ళు పోయేలా పని చేస్తే ఇంకో 4 బటానీలు చేతిలో పెడతారు...
సరే పోనీ onsite లో మనకి మాంచి పేరేమైనా ఉందా అంటే....onsite వాడు కూడా ఎప్పుడు చూడు....పోయిన రెండు వారాలు నీ performance బానే ఉంది...మరి ఈ వారం ఏం అయ్యిందో తెలియదు....తగ్గిపోతుంది నీ performance అని పాడిన పాటే పాడుతుంటాడు........మళ్లీ  ఇక్కడ అసంతృప్తి.....అసలు పెళ్ళైన అమ్మాయిలంతా ఎలా మనేజ్  చేస్తున్నారబ్బా??? పిల్లలు ఉన్నవాళ్లు కూడా ఉద్యగం చేస్తున్నారే....నేనెందుకు ఇలా...నేనొక్కదాన్నే ఇలా ఉన్నానా అని ఏదో బాధ.....ఇలా చిరిగిన  ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ముక్కలు తెచ్చి అతికించి చూస్తే....నాకే అర్ధం కాలేదు....మళ్లీ  అసంతృప్తి....                                                       
                                                       
అమ్మ ఇంటికి వస్తే గట్టిగా ఒక గంట తన పక్కన కూర్చుని మట్లాడే తీరిక లేని సంపాదన , భర్త పుట్టినరోజు నాడు ఒక గంట ముందుగా ఇంటికి రాలేని ఉద్యోగం...రేపు పిల్లలు పుడితే వాళ్ళకి తినిపించటానికి, ప్రేమగా దగ్గరకు తీసుకోవటానికి  టైం ఉంటుందా?? బాబోయ్ !!!! వద్దు నాకీ సంపాదన అనిపించింది...
ఇంతలోనే నా మనసుకి నేనే సర్దిచెప్పుకున్నా...."బంగారం....ఇన్ని భాద్యతల మధ్య నీకు తోచిందేదో నువ్వు చేస్తున్నావ్,నిన్ను నువ్వు చూసుకుని గర్వపడాలి....పిల్లలు పుట్టేదాక ఉద్యోగంలో పైకి ఎదుగు...పిల్లలు పుట్టాక మనేయోచ్చులే...అప్పుడు కుటుంబానికే మన ఓటు" అని..

ఇలా అనుకున్న కొన్నాళ్ళకి మా జీవితంలోకి ఒక బుజ్జి పాప వచ్చింది.....లీవ్ పెట్టాను కానీ resign చేయలేదు....మొదటి 6 నెలలు ఎలానో వర్క్ ఫ్రం హోం అని పని కానిచ్చాను......కానీ, తర్వాత మా మేనేజర్ మహానుబావుడు....ససేమిరా అన్నాడు.....ఉద్యోగం కావాలంటే ఆఫీసుకి రావాల్సిందే అన్నాడు.....ఉద్యోగమా?? కుటుంబమా?? అనే సంఘర్షణలో.....పెరిగిన కర్చులు, భాద్యతల కారణంగా ఉద్యోగమే గెలిచింది..... పాపని వదిలి వెళ్లాలని లేకపోయినా, తప్పలేదు.... మళ్లీ అవే ఉరుకులు పరుగులు.....ఉదయాన్నే లేవటం...వంటచేయటం,నేను రెడీ అయ్యి పాపని రెడీ చేసి, నాకో డబ్బా,మా వారికో డబ్బా,పాపకి అన్నీ సర్దుకుని ,9 గంటలకి పాపని daycare లో వదిలేసి ఆఫీసుకి వెళ్ళటం.....మళ్లీ సాయంత్రం 7 గంటలకి పాపని daycare నుండి తీసుకుని ఇంటికి వచ్చి వంటచేయటం......రోజంతా దానితో ఉండకపోవటం మూలంగా, ఇంటికి వచ్చాక అది ఒక్క నిమిషం నన్ను వదలదు...ఇలా మళ్లీ తినటం,పాపని పడుకోబెట్టి నేను పడుకోవటం...మళ్లీతెల్లారితే పరుగుల జీవితం.....ఎన్నాళ్ళిలా????

అసలు అమ్మాయిలు పెళ్ళయ్యాక  ఉద్యోగం చేయాలా?? మానేయాలా???

ఏంటి?? ఈ అమ్మాయి ఏదో కష్టాలన్నీ అమ్మాయిలకే అయినట్టు చెబుతోంది.....బాగా ఆడవాళ్ళ పక్షపాతిలా ఉంది....అని నా మీద కారాలు,మిరియాలు నూరుతున్నారా?? ఆగండాగండి అక్కడికే వస్తున్నా.....ఇప్పటి వరకు నేను ఒక సగటు అమ్మాయి ఎలా అయితే ఆలోచిస్తుందో, మదన పడుతుందో చెప్పాను , కానీ ఇలా మదనపడే అబ్బాయిలూ ఉంటారు ...ఉద్యోగంలో busy గా ఉండి , ఫ్యామిలీ తో గడపలేకపోతున్నాం అని వాళ్ళు కూడా బాధపడతారు.


నోట్: ఇది నా కథ కాదు...నా స్నేహితురాళ్ళు, తెలిసినవాళ్ల అండ్ నా అనుభవాలు అన్నీకలిపి ఇలా రాసాను :)


 

View Count




Useful Links